హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసి) అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది ఎన్‌ఎంసి అనుమతి మంజూరు చేసిన మెడికల్ కళాశాలల సంఖ్య 5కు చేరింది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది రికార్డు స్థాయిలో రాష్ట్ర్రంలో 9 మెడికల్ కళాశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ మెడికల్ కళాశాలలకు ఎన్‌ఎంసి అనుమతి మంజూరు చేయగా తాజాగా జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, జనగామలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు ఎన్‌ఎంసి అనుమతి మంజూరు చేయడంపై రాష్ట్ర్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం వైద్య విద్యను చేరువ చేయడం ప్రభుత్వ సంకల్పమనీ, అందులో భాగంగానే ప్రతీ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు మౌలిక సౌకర్యాలు, భవనాల నిర్మాణం, బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు వంటి సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తున్నదని చెప్పారు. త్వరలోనే మిగతా కళాశాలలకు కూడా ఎన్‌ఎంసి అనుమతి సాధిస్తామనీ, ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.