Saturday, November 16, 2024

ఎన్‌జీటీ ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి : గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి/ టేకుమట్ల (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావ్ పల్లి(బి), కాల్వపల్లి వాగుల నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఎన్‌జీటీ ఉత్తర్వులు, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. గురువారం టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు పరచాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో లో పాల్గొన్న గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికార యంత్రాంగం అండదండలతో ఇసుక మాఫియా దందా జోరుగా సాగుతోందని విమర్శించారు.

వెంటనే ఇసుక క్వారీలు నిలిపివేయాలి
టేకుమట్ల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒకటి, రెండు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వని ప్రభుత్వ అధికారులు, నిత్యం వందలాది లారీలల్లో మాత్రం ఇసుక తీసుకుపోవడానికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో డీసిల్టేషన్ పేరుతో నడుస్తున్న అక్రమ ఇసుక క్వారీలను రద్దు చేయవలసిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ 31మే రోజున మధ్యంతర ఉత్తర్వుల ద్వారా జిల్లా కలెక్టర్ ను ఆదేశించినప్పటికీ అక్రమ ఇసుక రవాణాను నిరోధించడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనందున స్థానిక రైతాంగం ఇసుక లారీలను నిలిపివేసి తమ నిరసనను ప్రకటించారన్నారు. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో దాఖలైన పిటిషన్ సంఖ్య 68/2023 లో 31 మే రోజున మద్యంతర ఉత్తర్వులనిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ డీసిల్టేషన్ పేరుతో మానేరు , గోదావరి నదులలో (14) చోట్ల ఇసుక రీచ్ ల ఏర్పాటుకు అనుమతించిన ప్రొసీడింగ్స్ రద్దు చేసిందని తెలిపారు. ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయుటకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని, లేనియెడల అతనిపై సైతం వ్యక్తిగతంగా చర్యలు తీసుకోబడునని ఎన్జీటీ హెచ్చరించినప్పటికీ ఇసుక మాఫియా ప్రలోభాలకు లోనైన జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని జీఎస్సార్ ఫైర్ అయ్యారు.

తాము ఎన్జిటి ఉత్తర్వుల కాపీతో సహా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైనందునే అనివార్యంగా ఇసుక లారీల నిలిపివేతకు పూనుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిస్తూ, రైతుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మారుస్తున్న ఇసుక త్రవ్వకాలను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు మాదం కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శులు దాసారపు సదానందం, పొన్నం సాంబయ్య, గోనపల్లి సంపత్, శాస్త్రాల కిరణ్, తోడేటి కుమార్, మంద నరేందర్, బొల్లికొండ చిన్న రాజయ్య, అచ్చ స్వామి, అనవేణి మొగిలి శాస్త్రాల సుధాకర్ అల్లం ఓదెలు, పంజాల రవి, గోనే శ్రీనివాసరావు, చిట్యాల శ్రీనివాస్, రెడ్డి రాజుల రాజు, మచ్చ ప్రభాకర్, నునేటి రమేష్, వేముల మనోహర్, నానవేన రాజు, పండుగ అనిల్, సతీష్, ఉడత రమేష్, పండుగ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement