Friday, November 22, 2024

నీట మునిగిన జాతీయ రహదారి.. జలదిగ్బంధంలో 25 గ్రామాలు

వాజేడు : ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా పెరుగుతుండడంతో వాజేడు మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి క్రమేపి పెరుగుతూ ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 15.330 మీటర్లకు చేరుకుంది. దీంతో నూతన ప్రాంతాలు జలమయమయ్యాయి. 163 జాతీయ రహదారి చీకుపల్లి గ్రామం వద్ద నీట మునగడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది. అదేవిధంగా తెలంగాణ ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారి నీట మునగడంతో అంతర్ రాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ నేపథ్యంలో 25 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో కాలం వెళ్లదీస్తున్నారు. వాజేడు మండలాన్ని వరదలు ముంచెత్తుతున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉదృతంగా పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వరదలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు మరలా వరదలు సంభవిస్తుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళనతో టెన్షన్ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement