కరోనా కష్టకాలంలో కొందరు మానవతావాదులు అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. కొందరు లాక్‌డౌన్ వేళ పేదల ఆకలి తీరుస్తూ నేనున్నానంటూ వారి కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో ఉన్నవారికి వైద్య సాయం అందిస్తూ ఆక్సిజన్ సిలిండర్ల దగ్గర నుంచి మందుల వరకు అందిస్తున్నారు. ఇంకొందరు దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే స్వదేశానికి రప్పిస్తూ చేయూతను అందిస్తున్నారు. అయితే, ఇదే కోవలో తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్సీ మరో అడుగు ముందుకేసి.. తనకు ఎన్నికల సమయంలో సాయం అందించినవారికి అపన్న హస్తం అందిస్తున్నారు.
ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి మెడికల్ కిట్‌బ్యాగులను పంపించారు. అయితే, ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.
మెడికల్ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్.. మహా అయితే డ్రైఫ్రూట్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటే పైన చెప్పిన వస్తువులతో పాటు ఆ ప్యాక్‌లో టీచర్స్ విస్కీ పుల్ బాటిల్ కూడా ఉంది. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. దీంతో ప్యాక్ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు.