వాజేడు, (ప్రభన్యూస్) : భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఇవ్వాల (శనివారం) పర్యటించారు. ఈ క్రమంలో వాజేడు మండల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రోటోకాల్ పాటించచడం లేదని ఫైర్ అయ్యారు. ఎంపీవో శ్రీకాంత్, ఎంపీడీవో విజయ తీరుపై మండిపడ్డారు. నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యేకు తెలియకుండా వివిధ పంచాయతీల్లో అధికారులు పంపిణీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు ఎలా ప్రారంభిస్తారన్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం అధికారులకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రోటోకాల్ తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. కానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేమైనా మీ బాబు జాగీరా అంటూ మండిపడ్డారు పొదెం వీరయ్య. ప్రభుత్వం నుండి ప్రజలకు మంజూరయ్యే ప్రతిదీ తన దృష్టిలో ఉండాలని అధికారులకు సూచించారు.