సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కరుడని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. రాష్టంలో అన్ని మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ.. రాజ్యంగా బద్ధంగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ దేశానికే ఆదర్శమని చెప్పారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ కేంద్రంలో జరిగిన రంజాన్ తోఫా కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు. అదే విధంగా 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు సమానంగా చూస్తూ వారి వారి పండుగలకు కేసీఆర్ బతుకమ్మ చీరెలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రాష్టంలో పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న లక్ష్యంతోనే ప్రతి పండుగకు కేసీఆర్ కానుక అందిస్తున్నారన్నారు. ఈ ఏడాది అన్ని మతాల వారు కలసి ఈద్ ఉల్ ఫితర్‌ను సంతోష వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింల కోసం మైనార్టీ కళాశాలలు, పాఠశాలలు, గురుకులాలు, షాదీ ముబారక్, మోజంలకు జీతాలు ఇలా ఎన్నో పనులు కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే వారికి ఇఫ్తార్ విందు కార్యక్రమం కూడా ప్రతి ఏటా ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ పాలన ఓర్వలేక బీజేపీ నాయకులు లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. ఎన్నికలకో వేషం మారుస్తూ.. ప్రజలను ఏమారుస్తున్న బీజేపీకి భవిష్యత్‌లో ప్రజలు తప్పక బుద్ది చెబుతారని హెచ్చరించారు. మోదీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. దేశంలో అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉన్నాయని, ఎవరి ఇష్టానుసారం వేషధారణ కలిగే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. దానిని దిక్కరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ గుడిపుడీ నవీన్ రావు, మరిపెడ మునిసిపల్ చైర్మెన్ గుగులోత్ సింధూర రవి, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.