ప్రభన్యూస్ ప్రతినిది, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించాల్సి ఉండగా భారీ వర్షాలతో వారి పర్యటన వాయిదా పడినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం తెలిపారు. కొత్తపల్లిగోరి మండలంలో ఎమ్మార్వో, ఎంపీడీవో భవన నిర్మాణాలకు శంకుస్థాపన, గణపురం మండలం మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన, భూపాలపల్లిలోని వంద పడకల ఆసుపత్రిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ప్రారంభోత్సవం డాక్టర్స్ క్యాంటీన్, భూపాలపల్లి కలెక్టరేట్లో నిర్వహించబోయే రివ్యూ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే…
గణపురం మండలం గాంధీనగర్ శివారులోని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాట్లను హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ఇండస్ట్రియల్ జీఎం రవి, ఇండస్ట్రియల్ వరంగల్ జోనల్ మేనేజర్ స్వామి, జిల్లా కలెక్టర్ రావుల శర్మ, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వర్షంలోనే తడుస్తూ పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో రేపటి అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాలన్నీ రద్దు చేయడం జరిగిందని, త్వరలోనే శంకుస్థాపన తేదీలను ప్రకటిస్తామని, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి, చిట్యాల సీఐలు నరేష్, మల్లేష్, భూపాలపల్లి, గణపురం ఎస్సైలు ప్రసాద్, సాంబమూర్తిలు వున్నారు.