మహబూబాబాద్ జిల్లా వేమునూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాకు చెందిన భూక్య రెడ్యా అనే రైతుకు చెందిన రూ.2లక్షల డబ్బును ఎలుకలు కొరికేశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. చికిత్స కోసం దాచుకున్న నగదును ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచారు. రెడ్యాకు మంత్రి సత్యవతి ఫోన్ చేసి మాట్లాడారు.
రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎమ్మార్వో రంజిత్ని రైతు రెడ్యా దగ్గరకు పంపించి, ధైర్యం చెప్పారు. రెడ్యా డబ్బుల విషయంలో గాని, చికిత్స విషయంలో గాని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా మంత్రి హామీతో రైతు రెడ్యా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి: రూ.2 లక్షలను కొరికేసిన ఎలుకలు