Saturday, November 23, 2024

మాతృత్వం ఓ తీయ‌ని మ‌మ‌కారం : మంత్రి ఎర్ర‌బెల్లి

  • ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లోనే ప్ర‌సూతి కావాలి
  • ప్ర‌స‌వాల్లో ఆప‌రేష‌న్ల‌ను నివారించాలి
  • ప్ర‌జ‌లంతా అవ‌గాహ‌న‌తో మెల‌గాలి
  • 150 మంది గ‌ర్భిణీల‌కు ఘ‌నంగా చీర, సారెల‌తో స‌త్కారం
  • ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు స‌హ‌కారంతో, వందేమాత‌రం ఫౌండేష‌న్ సామూహిక శ్రీ‌మంతోత్స‌వంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఉషా ద‌యాక‌ర్ రావు దంప‌తులు

తొర్రూరు : మాతృత్వం ఓ తీయ‌ని మ‌మ‌కారం… దాన్ని విచాక‌రం చేసుకోవ‌ద్దు. అన‌వ‌స‌ర ఆప‌రేష‌న్లు చేయించుకోవ‌ద్దు. ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లోనే ప్ర‌సూతి కావాలి. సుఖ ప్ర‌స‌వాల (ఈజీ డెలివ‌రీల‌)కే ప్రాధాన్య‌మివ్వాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వారి స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్‌, శ్రీ‌మ‌తి ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం తొర్రూరు ప‌ట్ట‌ణంలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ స‌హ‌కారంతో వందేమాత‌రం ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సామూహిక శ్రీ‌మంతోత్స‌వం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 150మంది గ‌ర్బిణీల‌కు చీర‌, సారెల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం వారినుద్దేశించి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు. వెనుక‌టికి మంత్ర‌సానులు ప్ర‌స‌వాలు చేసేవారు. అయితే, మారిన ఆధునిక కాలంతో పాటు ప్ర‌స‌వాల‌లో కూడా ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఇప్పుడ‌న్నీ సెక్ష‌న్‌, సిజేరియ‌న్ అంటున్నారు. దీని వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే త‌ల్లులు అయిన వారంతా ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌ర్భ సంచీలు తీసివేయాల్సి రావ‌డం, వెన్ను నొప్పులు, ఇత‌ర అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వీట‌న్నింటినీ అదిగ‌మించాలంటే… గ‌ర్భిణీలు క‌చ్చితంగా ఈజీ డెలివ‌రీల‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని, అలా గ‌ర్భిణీల భ‌ర్త‌లు, కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌వ్వాలి. అందుకే ఆప‌రేష‌న్లు లేని ప్ర‌స‌వాలు జ‌రిగే విధంగా ప్ర‌య‌త్నించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ఉద్బోధించారు. ఇటీవ‌ల రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావుతో క‌లిసి కొన్ని స‌మావేశాల్లో పాల్గొన‌గా, గ‌ర్భిణీలు, వారి కుటుంబ స‌భ్యులే ఆప‌రేష‌న్ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఇంకొంద‌రు తేదీ, తిథి చూసుకుని ఆప‌రేష‌న్లు చేసి ప్ర‌స‌వాలు చేయాల‌ని త‌మ‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని డాక్ట‌ర్లు అంటున్నార‌న్నారు. ధైర్యం చేసి వైద్యం చేస్తే, విక‌టించిన సంద‌ర్భాల్లో త‌మ ద‌వాఖానాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఈ ద‌శ‌లో ప్ర‌జ‌లే చైత‌న్య‌మ‌వ్వాల‌ని సూచించారు. ఒక అవ‌గాహ‌న‌తో మెల‌గాల‌ని చెప్పారు. ముందు నుంచే త‌గు జాగ్ర‌త్త‌లు, ఎక్సర్ సైజులు చేస్తే, సుఖ ప్ర‌స‌వాలు జ‌రుగుతాయ‌ని సైన్స్‌, డాక్ట‌ర్లు, నిపుణులు చెబుతున్నార‌ని మంత్రి అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే గ‌ర్బిణీలు సైతం కొంత బాధ‌లు భ‌రించైనా ఈజీ డెలివ‌రీల‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా గ‌ర్భిణీల‌కు చీరె, సారెలు పెట్టారు. వారిని స‌త్క‌రించారు. గ‌ర్భిణీలుగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఆరోగ్య సూత్రాలు, ప్ర‌స‌వాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ‌శాంక్‌, వందేమాత‌రం ఫౌండేష‌న్ త‌క్కెళ్ళ‌ప‌ల్లి ర‌వింద‌ర్ రావు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పట్ట‌ణ ప్ర‌ముఖులు, అనేక మంది మ‌హిళ‌లు, గ‌ర్భిణీలు, వారి కుటుంబ స‌భ్యులు, త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement