ఉనికి కోసం మావోయిస్టుల ఆరాటం…
పట్టు కోసం పోలీసుల పోరాటం
దీపక్ నేతృత్వంలో తెరపైకి
నిఘా విభాగం అప్రమత్తం!!
వరంగల్ క్రైమ్ – మావోయిస్టు పార్టీలో కొత్త యాక్షన్ టీం రంగంలోకి దిగింది. ఛత్తీస్గఢ్కి చెందిన దీపక్ సారథ్యంలో నలుగురు సభ్యులు ఈ బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్న దీపక్ ఇన్నాళ్లూ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రస్తుతం తెలంగాణలో యాక్షన్ టీం లేకపోవడంతో అతడి నాయకత్వంలోనే పార్గీ ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై సంచరిస్తూ ఎంచుకున్న లక్ష్యాలపై రెక్కీ నిర్వహించి, అదను చూసి దాడులకు దిగేలా ఈ బృందానికి శిక్షణ ఇచ్చారని సమాచారం అందుకున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఏదైనా అనూహ్య ఘటనకు పాల్పడేలా పార్టీ నాయకత్వం ఈ బృందానికి దిశానిర్దేశం చేసినట్లు నిఘా విభాగానికి సమాచారం అందింది.
2020 అక్టోబరులో అనూహ్యంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో తెరాస నేత భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చడం అప్పట్లో కలకలం రేపింది. ఈ క్రమంలో సరిహద్దులో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని నిఘావిభాగం అప్రమత్తం చేసింది. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులపై దాడులకు అవకాశముందనే అనుమానాలతో వాటిని తిప్పికొట్టే వ్యూహరచనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ బృందాలు ఇప్పటికే ఛత్తీస్గఢ్ సరిహద్దుల వరకూ వెళ్లి తరచూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి.
ఎన్కౌంటర్లతో కార్యకలాపాలకు విరామం
మావోయిస్టు పార్టీ పగ్గాలను నంబాల కేశవరావు చేపట్టాక తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో దళాల కదలికలు ముమ్మరమయ్యాయి. దీన్ని పసిగట్టిన పోలీసులు కూంబింగ్ విస్తృతం చేశారు. డీజీపీ మహేందర్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆసిఫాబాద్ జిల్లా మంగి అటవీ ప్రాంతంలోనే మకాం వేసి క్షేత్రస్థాయి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వరుస ఎన్కౌంటర్లలో 9 మంది మావోయిస్టులు మృతిచెందారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు, కంకణాల రాజిరెడ్డి, ఆజాద్ తృటిలో తప్పించుకొన్నారు. ఈ ఎన్కౌంటర్లలోనే అప్పటి యాక్షన్టీం సభ్యులు శంకర్, శ్రీనివాస్, ఐతు మరణించారు. మరో సభ్యుడు మహేశ్ అలియాస్ కొవ్వాసి గంగా అరెస్టయ్యాడు. దీంతో కొంతకాలం యాక్షన్టీం కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజాగా కొత్త బృందాన్ని పార్టీ రంగంలోకి దించింది. గతేడాది ఎదురుదెబ్బలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బృందం మెరుపుదాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసిన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ లో మరోమారు ఎత్తులు, పైఎత్తులతో ఇరువర్గాలు ఆధిపత్య నిరూపణకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉనికి కోసం మావోయిస్టులు, పట్టు కోసం పోలీసుల పోరు ఎటువైపు దారి తీస్తోందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.