భూపాలపల్లి(ప్రభ న్యూస్) : ఆజాంజాహి మిల్స్ కార్మికుల యూనియన్ కార్యాలయాన్ని వెంటనే కార్మికుల పరం చేయాలని భరాత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటి కార్యదర్శి వెంకటేష్ శనివారం లేఖ విడుదల చేశారు.
లేఖలో..
వరంగల్ మహానగరంలో ఆజాంజాహి మిల్స్ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద పరిశ్రమ. సుమారు 10 వేల మందికి ఉపాది కల్పించిన ఘనమైన చరిత్ర ఉన్నది. నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినప్పటి నుండి దోపిడి వర్గాలు నష్టాల పేరుతో పరిశ్రమలను అమ్మడం, మూసివేయడం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరిశ్రమను కూడా మూసివేశారు. దీంతో కార్మికులంతా వీధిపాలయ్యారు. పరిశ్రమ స్థలాన్ని గత ప్రభుత్వాలే అమ్ముకున్నాయి. 1957లో ఆజాంజాహి మిల్స్ వర్కర్స్ యూనియన్ వెంకట్రామ్ టాకీస్ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే అత్యంత విలువైన 1400 గజాల స్థలంలో కార్మికులందరు తమ హక్కుల కోసం పోరాడడానికి, కష్టసుఖాలు చెప్పుకోవడానికి కార్మికులందరు పైసా పైసా చందాలు వేసుకుని నిర్మించుకున్నారు. బడాబాబులు ఇంతవరకు ఖాళీ స్థలాలు, అసైన్డ్ భూములు మాత్రమే ఆక్రమించిన భూకబ్జాదారులు ప్రస్తుతం ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఆజాంజాహి కార్యాలయం, దాని స్థలాన్ని బడాబాబులు తూర్పు ఎంఎల్ఎ నన్నపునేని నరేందర్, మాంగల్య షాపింగ్ మాల్, నమశ్శివాయ మరికొంత మంది అనుచరులతో కలిసి నన్నపునేని నరేందర్ బినామి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేశాడు. ఇది పేరుమోషిన షాపింగ్‌మాల్‌కు అమ్ముకున్నారు. ఇది గత నాలుగు సంవత్సరాలుగా సాగుతున్నది. ఆ పత్రాలతో బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. దానితో కార్మికులందరు ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ లీడర్లంతా నగరంలో, పట్టణాల్లో, మండల సెంటర్లలో అధికారులను బెదిరించి, లంచాలు ఇచ్చి, సామాన్య ప్రజల భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. దానితో ఘన చరిత్ర కలిగిన ఆజాంజాహి కార్యాలయం, దాని ఆవరణ స్థలాన్ని బడా బాబులు అమ్ముకుంటున్నారు. ఆజాంజాహి మిల్స్ కార్మికులారా మీరు పైసా పైసా చందాలు వేసుకుని నిర్మించుకున్న కార్యాలయం, దాని స్థలాన్ని మీరు అందరూ కలిసి కట్టుగా పోరాడి సాధించుకుని, మీరే ఉమ్మడిగా కార్యాలయాన్ని నిర్మించుకోవాలని డివిజన్ కమిటి పిలుపునిస్తుందని లేఖలో పేర్కొన్నారు.