Friday, November 22, 2024

147 మంది బాలకార్మికులకు విముక్తి.. పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 147 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలియజేసారు. దేశంలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనలో భాగంగా జనవరి మొదటి తారీఖు నుండి 31వ తేది వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ 9వ విడత నిర్వహింబడింది. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో పోలీసు, ఏహెన్టియూ (యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్), చైల్డ్ లైన్, లేబర్ విభాగాలు సంయుక్తంగా కల్పి తొమ్మిది బృందాలుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పరిశ్రమలు, ఇటుక తయారీ పరిశ్రమ, కంకర క్రషర్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, హోటళ్ళలో ఆకస్మిక తనీఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనీఖీల్లో 18 సంవత్సరాలు లోపు వున్న మొత్తం 147 మంది బాల కార్మికులకు పనుల నుండి విముక్తి కలిగించారు. ఇందులో 117 మంది బాలురు, 30మంది బాలికలు వున్నారు.

విముక్తి కలిగించిన మొత్తం బాలకార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56మంది కాగా, మిగతా 91 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులు ఉన్నార‌ని పోలీసులు విచారణలో తేలింది. తనీఖీల్లో గుర్తించబడిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పర్చి చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే చిన్నారులతో పనులు చేయించుకుంటున్న వ్యాపారస్థులపై మొత్తం 12 కేసులను నమోదు చేశారు. ఈ తనీఖీల్లో రెండు సంవత్సరాల క్రితం పర్కాల పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడుని ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చిన్నారుల బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై వుందని, వారి ప్రాధమిక హక్కులను భంగం కలిగించవద్దని, 18లోపు చిన్నారులతో పనులు చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైన చిన్నారులతో పనులు చేయించుకుంటున్నట్లుగా సమచారం అందింతే డయల్ 100 గాని, చైల్డ్ లైన్ నంబర్ 1098 నంబర్ సమాచారాన్ని అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement