Sunday, November 24, 2024

మంత్రి ఎర్ర‌బెల్లి ఇంటి ముట్ట‌డికి య‌త్నం – విద్యార్ధులు ఆరెస్ట్..

సునీల్ కుటుంబాన్ని ఆదుకోవాలి
ఎన్ ఎస్ యూఐ,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
వ‌రంగ‌ల్ – : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్వాల కార్తీక్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్ లు అన్నారు. ఉద్యోగాలు భ‌ర్తీ కోరుతూ క్రిమి సంహ‌ర‌క మందు సేవించి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విద్యార్ధి బోడ సునీల్ హైద‌రాబాద్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మ‌ర‌ణించాడు.. దీనిపై భ‌గ్గుమ‌న్న విద్యార్ధి సంఘాలు కె యు నుంచి మంత్రి ఎర్ర‌బెల్లి ఇంటిని ముట్ట‌డించేందుకు బ‌య‌లుదేరారు. వారిని పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు.. దీంతో కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలోని నయీంనగర్ లో ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలువడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని,రిజర్వేషన్ అమలు చేయడం లేదని ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి బోడ సునీల్ నాయక్ చనిపోవడం బాధాకరమన్నారు. నీళ్ళు,నిధులు,నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ లో సునీల్ నాయక్ లాంటి అమాయక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని,సునీల్ నాయక్ చివరి కోరిక మేరకు కెసిఆర్ పై చీటింగ్ కేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఖాళీగ ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని,సునీల్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని, కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని,మలిదశ ఉద్యమానికి సిద్దం కావాలని, తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ ను గద్దె దించడానికి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ,యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లె రాహుల్ రెడ్డి, ముత్యాల అరుణ్ కుమార్, గుడిపాటి శ్రీ చరణ్ రెడ్డి, మోతె వెంకటేష్, ప్రేమ్ చందు, నెమలి నితిన్, బొల్లం పవన్ కిరణ్, నాగరాజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement