Friday, November 22, 2024

12న కెటిఆర్ వ‌రంగ‌ల్ పర్యటన

వ‌రంగ‌ల్, ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, చేనేత‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌‌పాల‌క శాఖల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు వ‌రంగ‌ల్ కి రానున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ప‌లు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా కార్పొరేష‌న్ లోని ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు, ప‌నుల‌పై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ల మంత్రి సత్యవతి రాథోడ్ లు వ‌రంగ‌ల్ లోని మంత్రి ఎర్రబెల్లి క్యాంపు కార్యాల‌యం అర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను మంత్రులు స‌మీక్షించారు. ఆయా ప‌నులను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఏయే ప‌నులు ఎలా చేయాల‌నే దానిపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆ రూ రీ రమేశ్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతీ, GWMC, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో క‌లిసి ఆయా ప‌నుల‌ను స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్ర‌బెల్లి, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, ఈ మధ్య హైద‌రాబాద్ లో మంత్రి కెటిఆర్ తో జ‌రిపిన స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను, ఆయా ప‌నుల ప్ర‌గ‌తి తీరుని అధికారుల‌తో చ‌ర్చించారు. ఉగాది నుంచి వ‌రంగ‌ల్ లో ప్ర‌తి ఇంటింటికీ మంచినీటిని ప్ర‌తి రోజూ ఇవ్వాల‌న్న నిర్ణ‌యంలో భాగంగా 95వేల క‌నెక్ష‌న్లు ఇవ్వడం జరిగిందని ఆన్నారు. అయితే, స్లం ఏరియాల్లో త‌ప్ప‌నిస‌రిగా క‌నెక్ష‌న్లు అందేలా చూడాల‌న్నారు. రూ.1 కే క‌నెక్ష‌న్ కింద ప్ర‌తి ఇంటింటికీ న‌ల్లా క‌నెక్ష‌న్లు, మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను మంత్రులు ఆదేశించారు. ఒక్క మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం కిందే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1000 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వారు వివ‌రించారు. దేశంలో ఏ న‌గ‌రానికి లేని విధంగా మంచినీటిని వ‌రంగ‌ల్ కి అంద‌చేస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. అలాగే కార్పొరేషన్ లోని అంత‌ర్గ‌త రోడ్లు, మురుగునీటి కాలువ‌లు, పారిశుద్ధ్యం, పార్కులు, ప్ర‌ణాళికా బ‌ద్ధంగా న‌గ‌ర నిర్మాణం, భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు, భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప‌నులు, స‌త్వ‌ర‌మే పూర్తి చేయాల్సిన ప‌లు ప‌నుల‌పైనా మంత్రి సవివరంగా అధికారుల‌తో చ‌ర్చించారు.

12న కెటిఆర్ రాక సంద‌ర్భంగా….

ఏప్రిల్ 12 తేదీన మంత్రి కెటిఆర్ రాక సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు జిల్లా క‌లెక్ట‌ర్, వ‌రంగ‌ల్ న‌ర‌క కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తిల‌ను ఆదేశించారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు ప్రారంభోత్స‌వాలు, నిరుపేద‌ల‌కు ప‌ట్టాల పంపిణీ, వైకుంఠ ధామాల‌కు శంకుస్థాప‌న‌,వరద నాలాలు, న‌గ‌రంలో రోడ్ల శంకుస్థాప‌న‌లు, కొత్త పార్కుల ప్రారంభం, వ‌రంగ‌ల్ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జికి ప్రారంభోత్స‌వం, నైట్ షెల్ట‌ర్ల‌కు శంకుస్థాప‌న‌లు వంటి ప‌లు అంశాల‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు అధికారుల‌కు సూచించారు. అలాగే మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్ల పై కూడా మంత్రులు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రామ్ పూర్ నుంచి మొదలై, వరంగల్ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజక వర్గాల్లో వరసగా కార్యక్రమాలు ఉండనున్నాయి. అలాగే రూట్ మ్యాప్ గురించి, ఆయా అభివృద్ధి ప‌నుల తీరు తెన్నుల లపైనా మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement