Friday, November 22, 2024

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ నిఖిల


జనగామ… జిల్లాలో మద్దతు ధరకు యాసంగి ధాన్యం కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. నిఖిల తెలిపారు.మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, యాసంగిలో జిల్లాలో 1.68 హెక్టార్లలో వరిసాగు జరిగినట్లు, ఇందులో 2 లక్షల 86 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నట్లు ఆమె తెలిపారు. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, దిగుబడి అంచనాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడి వారు అక్కడే తమ పంటను అమ్ముకునే వెసులుబాటుకుగాను జిల్లా వ్యాప్తంగా ఐకెపి ద్వారా 118, పిఏసిఎస్ ల ద్వారా 71, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 4, మొత్తం 193 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 18 బాయిల్డ్, 17 రా రైస్ మిల్లులకు అనుసంధానం చేశామన్నారు. ప్రతి కేంద్రానికి ఒక అధికారిని, వ్యవసాయ విస్తరణ అధికారిని, ఒక విఆర్ఏ లను, మండలాల వారీగా మండల తహసీల్దార్, క్లస్టర్ అధికారిని, నియోజకవర్గ వారీగా పౌరసరఫరాల డిటీలను, డివిజన్ల వారీగా ఆర్డీవోలను పర్యవేక్షణకు నియమించడం జరిగిందన్నారు. కేంద్రాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ చైర్మన్ గా డీసీపీ, డిసిఎస్వో, డిఎంసీఎస్,డిఎంవో, ఆర్టీవో, డీఏఓ, డిఎల్ఓ, ఎల్డిఎం, ఏఎంఎఫ్సిఐ, డిసిఓ, డీఆర్డీవో, డిఎల్ఎంవో, ఆర్డీవో లు జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లు సభ్యులుగా జిల్లా ధాన్య సేకరణ కమిటీ ని ఏర్పాటుచేసామన్నారు. కొనుగోలు కేంద్రాల బాధ్యులకు కేంద్రాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కొనుగోలు ప్రక్రియను ఆన్లైన్ నమోదుకు ట్యాబ్ లను వాడటంపై ఈ నెల 16, 17 తేదీల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌళిక వసతుల కల్పన చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా తడకలతో పందిళ్లు, త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, ప్రధమ చికిత్స సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కరోనా నియంత్రణకై మాస్కులు, శానిటైజర్, సబ్బులు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా ను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సుకై ఒకేసారి కేంద్రాల వద్దకు రైతులు రాకుండా, వ్యవసాయ విస్తరణ అధికారులచే ముందస్తుగా టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టామన్నారు. అట్టి టోకెన్లలో రైతు ఏ రోజు, ఏ సమయంలో, ఏ కేంద్రం వద్దకు ధాన్యం తేవాలో పూర్తి వివరాలతోపాటు కేంద్ర బాధ్యుల వివరాలు పొందుపర్చామన్నారు. కేంద్రాల్లో రైతులకు సరిపడ గోనె సంచులు, టార్పాలిన్లు, తూకం, తేమ పరీక్ష, తూర్పారపట్టే యంత్రాలను సమకూర్చామన్నారు. హమాలీల కొరత లేకుండా జిల్లా ధాన్య సేకరణ కమిటీచే చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతీ కేంద్రానికి ఒక లారీని అటాచ్ చేసి, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే, అట్టి కేంద్రానికి అనుసంధానం చేసిన మిల్లుకు ధాన్యం తరలించుటకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రైతుల వద్ద ధాన్యం కొనిన వెంటనే ట్యాబ్ నమోదు పూర్తిచేసి, కేంద్రానికి అనుసంధానం చేసిన మిల్లునకు ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుందని, ధాన్యాన్ని మిల్లు వద్ద దిగుమతి చేసుకున్న మిల్లర్ రశీదు ఇచ్చిన వెంటనే పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఒకట్రెండు రోజుల్లో రైతుల ఖాతాలో ఓపిఎంఎస్ ద్వారా నేరుగా డబ్బులు జమచేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం తేమ 17 శాతం మించకుండా, ధాన్యాన్ని తమ తమ కల్లాల వద్ద ఆరబెట్టుకున్న మీదటనే కేంద్రాలకు తెచ్చే విధంగా వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, గ్రామ ఇతర ప్రతినిధులను సమన్వయం చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1888, సాధారణ రకానికి రూ. 1868 ల కనీస మద్దతు ధరకు కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ధాన్య కొనుగోలు విషయంలో ఏమైనా ఇబ్బందులు, ఫిర్యాదుల నమోదుకు 6303928718 వాట్సాప్ నెంబర్ ఏర్పాటుచేసామన్నారు. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, కరోనా నియంత్రణకై మాస్కులు తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ధాన్య కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement