Friday, November 22, 2024

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనాలి: మంత్రి ఎర్రబెల్లి

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛందంగా పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి 22 వరకు ద్విసప్తాహం వేడుకలను ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా నిర్వహించాలన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించి, విజయవంతం చేయాలని ఆదేశించారు. 8న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 9న ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ జరుగాలన్నారు. 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడంతో పాటు ఫ్రీడమ్‌ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. 11న ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించాలని, 12న రాఖీ దినోత్సవం, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. 14న సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు యథావిధిగా నిర్వహించాలన్నారు. 16న ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరా నిర్వహించాలన్నారు. 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ, 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లల్లో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ చేయాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. 20న దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుందని, 22న ఎల్‌బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగుతాయని మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement