Friday, November 22, 2024

Raining | ఎడతెరిపిలేని వానలు.. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

ఉమ్మడి వరంగల్‌ ప్రభన్యూస్‌ బ్యూరో: గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, వరంగల్‌, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలు గోదావరి పరివాహక ప్రాంతాలు కావడంతో ఆ జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.

అల్పపీడన ద్రోణి ప్రభావం నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు కురవడంతో పాటు మహారాష్ట్రలో బారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత నది పొంగి ప్రవహిస్తున్నది. ప్రాణహిత నది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరిలో కలుస్తుంది. దీంతో గోదావరి ఉధృతి కూడా క్రమంగా పెరుగుతున్నది. మరోవైపున ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకున్నది.

- Advertisement -

గోదావరికి పోటెత్తుతున్న వరద

భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. కాళేశ్వరంలోని లక్ష్మీ బ్యారేజీ వద్ద 4,21,730 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు 46 గేట్లను ఎత్తి 3,84,450 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీరు నిల్వ ఉండకుండా వచ్చిన నీరు వచ్చినట్లుగానే దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం లక్ష్మీబ్యారేజీ వద్ద నుంచి విడుదలైన నీరు, మార్గమధ్యలో అనేకవాగులు గోదావరిలో కలుస్తుండటంతో తుపాకులగూడెం వద్ద వరద ప్రవాహం మరింతగా పెరుగుతోంది.

తుపాకులగూడెం వద్ద 4 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతంనుంచి వస్తుండగా, వచ్చిన నీరు వచ్చినట్లుగానే సమ్మక్క బ్యారేజీ వద్ద నీటి నిల్వ లేకుండా కిందికి వదులుతున్నారు. దీంతో ఏటూర్‌నాగారం- రామన్నగూడెం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం వరకు ఏటూర్‌నాగారం -రామన్నగూడెం వద్ద గోదావరి ప్రవాహం 13 మీటర్లకు చేరుకున్నది.

ఎగువ ప్రాంతం నుంచి వరద పెరుగుతుండటంతో ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఏటూర్‌నాగారం, మంగపేట మండలాల్లో గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలకు వరద నీరు చేరుతుండటంతో వారిని అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తుండటంతో జలాశయాలలో జలకళ సంతరించుకుంది.

బోగత సందర్శన నిలిపివేత

రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులను ఆ ప్రాంతానికి అనుమతించకుండా ఆంక్షలు విధిస్తూ సందర్శనను నిలిపివేశారు.

వరంగల్‌ జిల్లాలో ఒకరు మృతి

వరంగల్‌ జిల్లా పైడిపల్లి గ్రామంలో కొత్తగూడెం కాలనీకి చెందిన రావిరాకుల విజయ్‌ అనే వ్యక్తి వర్షానికి ఇంటిగోడ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. వరంగల్‌ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని శిధిలావస్థకు చేరుకున్న భవనాలను పడగొట్టాలని అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గోదావరి పరివాహక ప్రాంతంలోని కన్నాయిగూడెం, ఏటూర్‌నాగారం, వాజేడు, నూగూరు వెంకటాపూర్‌, మంగపేట మండలాలను సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement