వరంగల్, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్ద అయ్యే ప్రమాదం ఉందని ధాన్యంపై తాడిపత్రులు కప్పుతూ తెల్లవారులు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అక్కడక్కడ కాంటా వేసిన దాన్ని లారీల ద్వారా మిల్లర్ల వద్దకు పంపిస్తే తరుగు పేరుతో దిగుమతి చేయకుండా మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ధాన్యం లారీలు మిల్లుల వద్ద క్యూ కడుతూనే ఉన్నాయి. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా అన్నదాతల పరిస్థితి తయారైంది. ఆరుకాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవాలంటే అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నటివరకు అకాల వర్షంతో రైతులు పడిన ఇబ్బందులు తెలిసిందే. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షపు వరద చేరి ధాన్యం తడిసిన సంగతి తెలిసిందే.
కొనుగోలు కేంద్రాల వద్ద నిర్ణయించిన ప్రకారం 41 కేజీల 200 గ్రాములు తూకం వేయాల్సింది.
తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద 42 కిలోల 200 గ్రాములు తూకం వేస్తున్నారు. ఇది చాలదంటూ తరుగు పేరుతో మరింత రైతుకు నష్టం కలిగించాలని మిల్లర్లు ధాన్యం సరిగా లేదు దిగుమతి చేసుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు రైతులు ధాన్యం లారీల డ్రైవర్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రెండు మూడు రోజులపాటు వాహనాలను మిల్లుల వద్ద నిలిపివేయడంతో రెండు మూడు కిలోలు తరుగు తీసిన సరే దాన్ని దిగుమతి చేసుకోమని రైతన్నలు మిల్లర్లను బతిమాలుతున్న పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. వరంగల్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఇతరత్రాధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇంతమంది అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేసినప్పటికీ నిర్వహణలో మార్పు లేకపోవడం విశేషం. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా సంబంధిత అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని రైతన్నలు వేడుకుంటున్నారు.