ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవ ర్గ కేంద్రంలో డీఆర్డీఏ, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. వేలాది మంది వచ్చి ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. మల్టినేషనల్ కంపెనీలు సహా 80 కంపెనీలు జాబ్‌మేళాకు హాజరయ్యాయి. పాలకుర్తి నియోజ కవర్గ పరిధిలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూర్, రాయపర్తి, పెద్దవంగర మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి కూడా ఉద్యోగాల కోసం యువతీయువకులు భారీగా తరలివచ్చారు.
బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎర్రబెల్లి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వరంగ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్‌సహకారంతో హైదరాబాద్ కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్‌లకు మల్టినేషనల్ కంపెనీలతో పాటు ఐటీ కంపెనీలను పంపించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయగా, అనేక దేశాల నుంచి కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్ జిల్లాలోని మడికొండలో టెక్‌మహేంద్ర, సీయాంట్ లాంటి 11కంపెనీలను ఏర్పాటుచేసి ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు మల్టినేషనల్ కంపెనీలతోపాటు ఫార్మర్, ఐటీ, బ్యాంకింగ్, హాస్పిటల్, ఇండస్ట్రియల్, సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్, ఫైనాన్స్ అనేక రంగాల్లో అపోలో, ఎంపవర్‌మెంట్ సర్వీసెస్, విప్రో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి అనేక కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీల్లో సెలక్ట్ అయిన వారికి రూ. 12 నుంచి 40 వేల వరకు జీతభత్యాలు ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 14,205 మందికి ఇక్కడికిక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. జాబ్‌మేళాకు వచ్చినటువంటి ఉద్యోగార్ధులకు భోజన వసతితో పాటు రవాణా సౌకర్యాలను కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్యతో పాటు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీఓ, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.