మంగపేట : గురువారం రాత్రి మండలంలో కురిసిన అకాల వర్షం మిర్చి రైతుల పాలిట శాపమైంది. చేతి కొచ్చిన పంట వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతన్న కంట కన్నీరు వరదలా పారుతుంది. ఓ ప్రక్క పంట పెట్టుబడి అధికం కావడం, పంటకు తెగుళ్ళు సోకడం, మరో ప్రక్క ఆశించిన మేర దిగుబడి, గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులపై గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం మూలిగే నక్కపై తాటి పండు చందంలా మారింది.
మంగపేట మండలం పొద్మూరుకు చెందిన ఎల్పీ.బక్క బాబు, ఎల్పీ.రాంబాబు, ఎల్పీ.చిన్న లాలయ్య, ఎల్పీ.నాగయ్య, దాసరి సమ్మక్క, బోడ పుల్లయ్య, కాట శ్రీదేవి, ఎల్పీ. సమ్మయ్య తదితర చిన్నకారు రైతులు తమ మిరప తోటలో కోసిన మిరప కాయలు ఎండడం కోసం పొద్మూరులోని గోదావరి సమీపంలోని వాగులో కళ్ళాలు చేసి ఆరబెట్టుకున్నారు. కాగా గురువారం రాత్రి అకాల వర్షం కురవడంతో వాగులోకి ఆకస్మికంగా వరద నీరు రావడంతో వాగులో ఆరబెట్టిన రైతులకు చెందిన ఎండు మిరపకాయలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటసాగు కోసం అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే పండించిన పంట వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ఎంఎస్పీ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ, నాయకులు మందపెళ్లి సతీష్ మాదిగ బాధిత రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital