చిట్యాల, డిసెంబర్ 4 (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్, శాంతినగర్ గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం వరి పొలం కోస్తున్న హార్వెస్టర్ ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒకేసారి మంటలు రావడంతో డ్రైవర్ రాజు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.
దీంతో హార్వెస్టర్ లో మంటలు రావడంతో కాలిపోతుండగా సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్సై జి.శ్రావణ్ కుమార్ వెంటనే తమ సిబ్బందితో వెళ్లి రైతుల సాయంతో వ్యవసాయ మోటార్ పైపుల ద్వారా నీళ్లతో మంటలు ఆర్పివేశారు. లేకుంటే వరిపొలాలు అంటుకొని పెద్ద ప్రమాదం చోటు చేసుకొనేదని రైతులు అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్ రెడ్డి హార్వెస్టర్ ను పెంట ఓదెలు వరి పొలం కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఎలాంటి అపాయం (ప్రమాదం) జరగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.