Monday, November 25, 2024

ఎసిబి అధికారి పేరిట హాల్ చల్

అతను ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) అధికారి పేరిట తనకు తాను పరిచయం చేసుకొన్నాడు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ముద్ర పడ్డ రవాణా శాఖ (ఆర్ టి ఏ) కార్యాలయంలో హాల్ చల్ చేశాడు.
అధికారులు మొదలు,ఉద్యోగులు అతను వస్తున్నాడంటనే హడలిపోయేవారు. ఎక్కడి వారిక్కడే గప్ చూప్ అయ్యేవారు. ఎవ్వరికీ వారు మిస్టర్ పర్ఫెక్ట్ గా పనుల్లో నిమగ్నమయ్యారు. పైగా పైస ముట్టకుండ నీట్ గా చకచకా పనులు ముగించే వారు. కానీ సదరు ఎసిబి అధికారి హస్తమానం ఆర్ టి ఏ ఆఫీసులోనే మకాం వేస్తుండటంతో, సదరు ఎసిబి అధికారినే తమ దారిలోకి తెచ్చు కోవాలనుకొన్నారు. అనుకున్నదే తడవుగా తమ బ్రోకర్ల ను రంగంలోకి దింపారు. ఆర్ టి ఏ లో మకాం వేసే అధికారితో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కోసం మంతనాలు సాగించారు. ఆ ప్రయత్నం ఫలించింది.దాంతో ఓ జెంటిల్ మెన్ అగ్రిమెంట్ చేసుకొన్నారు. దాని ప్రకారం సదరు ఎసిబి అధికారికి ,తమకు రోజు వారిగా వచ్చే వాటాలో షేర్ ఇచ్చే విధంగా అండర్ స్టాండ్ కుదుర్చుకున్నారు.

ఓ అధికారి ఇప్పటి వరకు జరిగిన దందాకు గాను కొంత అమౌంట్ ను ముట్టజెప్పారు. కానీ సదరు ఎసిబి అధికారి ఎప్పటిలాగే ఆర్ టి ఏ కార్యాలయంకు వస్తుండటంతో రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులకు అనుమానం మొదలైంది. సదరు అధికారి ఫోటోను రహస్యంగా తీసి, ఎసిబి కార్యాలయంలో ఎంక్వైరీ చేశారు. అసలు ఆ ఫోటో లోని వ్యక్తికి ఏసీబీ కి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. ఊహించని షాక్ కు గురైనా ఆర్ టి ఏ అధికారులు, ఉద్యోగులు నకిలీ ఎసిబి అధికారి బాగోతం ఏమిటని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఉర్సు ప్రాంతానికి చెందిన వాడని, ఎసిబి అధికారి కాదని తెలి పోయింది.అసలు ఈ నకిలీ ఎసిబి అధికారి ఎవరంటూ ఆరా తీశారు. అవినీతి నిరోధక ఉద్యమం సాగించే సంస్థలో సభ్యుడిగా చేరి, ఏసిబి అని వచ్చే విధంగా నకిలీ ఐడెంటిటీ కార్డును తయారు చేసుకొని ఆర్ టి ఏ కార్యాలయంలో ఎసిబి అధికారి పేరుతో ముచ్చెమ్మటలు పట్టించాడు. వరంగల్‌ రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారినంటూ వసూళ్లకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా ఆర్టీఏ అధికారులకు, దళారులకు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
అక్రమాలపై తన వద్ద వీడియోలు, ఫొటో రికార్డులున్నాయని భయా బ్రాంతులకు గురి చేసి అందిన కాడికి దండుకున్నాడు. గతంలో పని చేసిన ఓ అధికారి ఠారెత్తి పోయి దశలవారీగా లక్షల రూపాయలు ముట్టజెప్పారు. ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, సిబ్బంది, కొందరు పెద్ద దళారులు సైతం బాధితుల జాబితాలో ఉన్నారు. పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ట్రూ కాలర్‌లో తన చరవాణి నెంబర్‌ను ఏసీబీ అధికారిగా సూచించేలా సాంకేతిక మార్పులు చేసుకొని ఫోన్‌లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డట్టు వెలుగు లోకి వచ్చాయి.ప్రతి రోజూ కార్యాలయ పరిసరాల్లో తిరుగుతూ నకిలీ ఏసీబీ అధికారిగా అవతారమెత్తి అటు ఆర్ టి ఏ అధికారులను, ఇటు బ్రోకర్ల కు పగలే చుక్కలు చూపించాడు. పది రోజుల క్రితం ఈ విషయం బయటికి రావడంతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.పోలీసుల విచారణలో నకిలీ ఎసిబి అధికారి అని తేలిపోయింది. సదరు కేటుగాడి బాగోతం పోలీస్ స్టేషన్ కు చేరుకొన్న తర్వాత కూడ కొత్త ట్విస్ట్ మొదలైంది. నకిలీ ఎసిబి అధికారి పై ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరెవ్వరు ఎంతెంత ఇచ్చారనే విషయాన్ని చెప్పే వారు లేకుండా పోయారు.

లిఖిత పూర్వక ఫిర్యాదు లేక పోవడం, నకిలీ ఎసిబి అధికారి పేరుతో ఎంత మొత్తం నొక్కేశాడో అనే విషయంపై క్లారిటీకి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మనీ రికవరీని ఎంత మొత్తం చూపించాలి, ఎవ్వరి వద్ద వసూళ్ళు చేశాడని చూపించాలో తెలియక పోలీసులు మీనమీసాలు లెక్కిస్తున్నారు. నకిలీ ఎసిబి అధికారి బాగోతం వెలుగు చూసి 10 రోజులు దాటినా , కేసును ఏమని చూపాలి,ఎయ్యే కేసులు నమోదు చేయాలని విషయంపై కూడ పోలీసులు తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖాధికారులు చుక్కలు చూపించిన నకిలీ కేటుగాడి కథను ఎలా ముగిస్తారో,వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement