Tuesday, November 26, 2024

ఎంజీఎంలో ఎలుకల దాడి ఘటనపై సర్కార్ సీరియస్ : మంత్రి ఎర్ర‌బెల్లి

ఎంజీఎంలో ఎలుక‌ల దాడి ఘ‌ట‌న‌పై సర్కార్ సీరియ‌స్ గా ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వరంగల్ ఎంజీఎంను సందర్శించి, పరిశీలించి, సమీక్షించి, మీడియాతో మాట్లాడుతూ…. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎంజీఎంలో నిన్నటి ఘటన దురదృష్టకరమ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ‌వర్నమెంట్ హాస్పిటల్స్ లో సహజంగానే అనేక పేషంట్ కేర్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారన్నారు. పేషంట్ల పట్ల నిర్లక్ష్యం కావాలని ఉండద‌ని, అయినా ఇలాంటి ఘటన విచారకరమ‌న్నారు. అందుకు ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే విచారణ చేసి, బాధ్యులుగా భావిస్తున్న సూపరింటెండెంట్ ను బదిలీ, ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారన్నారు. ఇంకా ఇక్కడ పేషంట్ కేర్ ను, పారిశుద్ధ్య పనులను చూస్తున్న ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామ‌న్నారు.

ఎంజీఎంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. గట్టి నిఘా పెట్టాలని, అత్యంత జాగ్రత్తగా, పేషంట్ల సేవలు కేంద్రంగా పని చేయాలని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కొత్త సూపరింటెండెంట్ ని ఆదేశించామన్నారు. ప్రజలు ప్రత్యేకించి పేషంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామ‌న్నారు. ధైర్యంగా, నమ్మకంగా ఎంజీఎంకు రావచ్చన్నారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఎంజీఎం తెలంగాణ వచ్చినంకనే బాగైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఎంజీఎంకి బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించారన్నారు. సిఎం కేసీఆర్ బంగారు తెలంగాణ‌లో భాగంగా ఆరోగ్య తెలంగాణ సాధించాల‌ని నిర్ణ‌యించారన్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్ మెడిక‌ల్ హ‌బ్ గా త‌యారైందన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌హా, ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా సూప‌ర్ మ‌ల్టీ స్పెషాలిటీ వైద్యం… వ‌రంగ‌ల్ లో అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. క‌రోనా క‌ష్ట కాలంలోనే దాదాపు వెయ్యి కోట్లు వైద్య రంగంపై ఖ‌ర్చు చేసి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు. వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్ లో 10 కె.ఎల్‌, 13 కె.ఎల్‌. 2 పిఎస్ఎ ఆక్సీజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. 1292 బెడ్ల‌ను ఆక్సీజ‌న్ బెడ్లుగా మార్చిన‌మ‌న్నారు. 227 ఐ.సి.యు బెడ్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. కొద్ది రోజుల క్రితమే మొత్తం 2 కోట్ల 28 లక్షల 50 వేల రూపాయలతో ప‌లు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు జ‌రుపుకున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement