Tuesday, November 26, 2024

మరింత చేరువగా సర్కారు వైద్యం : సీఎం, మంత్రికి సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు

గ్రామీణ ప్ర‌జ‌ల‌కు స‌ర్కారు వైద్యం మ‌రింత చేరువ చేసినందుకు ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి సీఎం కేసీఆర్ కు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కోరుతూ ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు హెల్త్ సబ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో ఉండడానికి సంబంధించి ఇప్పటికీ దాదాపు 90శాతం హెల్త్ సబ్ సెంటర్లు అద్దె భవనంలో నడపడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో కరోనా సమస్య తలెత్తినప్పుడు ఇంటి యజమానులు ఏఎన్ఎం సెంటర్లను ఖాళీ చేయాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేసినట్లు వైద్య బృందం తెలిపార‌న్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల వినతులను పరిగణలోకి తీసుకొని, గతంలో 25 సబ్ సెంటర్ల శాశ్వత భవనాల కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం అందరికి తెలిసిందేన‌న్నారు. వాటికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. మిగిలిన వాటికి కూడా శాశ్వత భవనాలని మంజూరు చేయాలని, ఇటీవల మార్చి 5వ తేదీన నర్సంపేట పర్యటనకు విచ్చేసిన ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావును క‌లిసి ప్రత్యేకంగా కోరడం జరిగింద‌న్నారు. అందుకు ఫలితంగా నేడు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు మరో 22 సబ్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం రూ.4 కోట్ల 40 లక్షల (ఒక్కొక్క సబ్ సెంటర్ కి రూ.20 లక్షల చొప్పున)ను తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ RC NO.354 ద్వారా అనుమతులను జారీచేయడం జరిగిందన్నారు. వాటి నిర్మాణాలకు సంబంధించిన స్థలాల గుర్తించే ప్రక్రియ పూర్తి కావడం జరిగిందని, మరో 4 నెలల్లో అన్ని సబ్ సెంటర్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున 59 సబ్ సెంటర్లకు శాశ్వత భవనాల మంజూరు తీసుకురావడం ఎంతో గర్వకారణమ‌న్నారు. సబ్ సెంటర్ల మంజూరుకి సహకరించిన కేసీఆర్ కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కు, నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 59 సబ్ సెంటర్లలో ఇప్పటివరకు 57 సబ్ సెంటర్లకు శాశ్వత భవన నిర్మాణం మంజూరు చేసుకోగా… కేవలం రెండింటికి మాత్రం మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చినట్లు ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేయడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement