Saturday, November 23, 2024

వరంగల్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల.. అధికారిక ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కొత్త జిల్లాల్లో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం, వరంగల్‌ అర్భన్‌, రూరల్‌ జిల్లాల పరిధిలో వైద్య కళాశాలను ప్రారంభించాలన్న యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వరంగల్‌ వెళ్తున్న సీఎం కేసీఆర్‌ ఇందుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిమ వైద్య కళాశాల నిర్వహకులు వరంగల్‌లో నిర్మించిన క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ శనివారం వరంగల్‌ వెళ్తున్నారు.

సీఎం రాక సందర్భంగా ఈ రెండు జిల్లాల యంత్రాంగాలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాలని సంకల్పించిన కేసీఆర్‌ తొలుత వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ప్రతిమ యాజమాన్యం నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించాక సీఎం కేసీఆర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని మంత్రి చెప్పారు.

వరంగల్‌లో ఎప్పుడో ఏర్పాటు చేసిన కాకతీయ వైద్య కళాశాల మాత్రమే ఉందని, వరంగల్‌లో జనాభా పెరగడంతోపాటు నగరం పెద్ద ఎత్తున అభివృద్ధిచెందిన ఈ తరుణంలో మరో వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ను కలిసి గతంలోనే చెప్పామని, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. శనివారం వరంగల్‌ పర్యటనలో వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే వరంగల్‌ను హెల్త్‌ సిటీగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగానే కొత్త వైద్య కళాశాల ఏర్పాటవుతుందన్న విశ్వాసంతో ఉన్నామని దయాకర్‌రావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement