హనుమకొండలోని జయ నర్సింగ్ కాలేజీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దివంగత మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కల్పనాదేవి కుటుంబం రోడ్డెక్కింది. కల్పనాదేవికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు జయసింహరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఉరితాడుతో ఆందోళనకు దిగారు. జయనర్సింగ్ కాలేజీ ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించారు. ఆస్తుల గొడవల విషయంలో వారు రోడ్డెక్కారు.
తన సోదరుడు నర్సింగారెడ్డి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ భార్యాబిడ్డలతో ఉరితాడు మెడకు బిగించుకున్నారు. నర్సింగారెడ్డి తనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా రోడ్డున పడేశాడని ఆరోపించారు. తనవాటా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జయసింహారెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కోట్లాది రూపాయల ఆస్తి పంచివ్వకుండా తన సోదరుడు నర్సింగారెడ్డి వేధిస్తున్నాడని జయసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. 24గంటల వ్యవధిలో తమ సమస్య పరిష్కారం చేయకపోతే ఇక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటామని జయసింహారెడ్డి హెచ్చరించాడు.