వాజేడు, జులై 19 ప్రభ న్యూస్ : సీజనల్ వ్యాధులు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య పనులు, ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని వరద ముంపు గ్రామాలైన టేకులగూడెం గుమ్మడిదొడ్డి ఏడుజర్లపల్లి గ్రామాలను పరిశీలించారు. వరదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గుమ్మదొడ్డి గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వాజేడు వైద్యశాలను తనిఖీ చేసిన ఆమె అక్కడి రోగుల రికార్డును పరిశీలించి గుమ్మడిదొడ్డి కొంగాల గ్రామంలో రెండు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ కేసులను వెంటనే ఫాలోఅప్ చేయాలని వాజేడు వైద్య అధికారి మహేందర్ మధుకర్ కు ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ అధికారులు, వైద్యాధికారులు కోఆర్డినేషన్ తో పనిచేస్తూ అటు పారిశుధ్య పనులు చేపడుతూ… ఇటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యం అందించాలని ఆదేశించారు. సీజనల్ కు సంబంధించిన మందులు ముందస్తుగానే తెప్పించుకోవాలని, అదేవిధంగా డెంగ్యూ, మలేరియా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదు కాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. ప్రజా ఆరోగ్యం ముఖ్యమని, ఈ మూడు నెలల పాటు అధికారులు కష్టపడి పని చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్ తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ వర్మ, ఎంపీడీవో విజయ, ఎంపీ ఓ శ్రీకాంత్, ఆర్ ఐ కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.