కమలాపూర్, మార్చి 19 (ప్రభ న్యూస్): అతని పోరాటం.. కన్న కొడుకును గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని, వికలాంగుడైన తన కొడుకును చూసి బాధపడకుండా ధైర్యంతో చదువు నేర్పించి పదవ తరగతి పరీక్షలు రాపిస్తున్నారు. ఏ రోజు నీవు వికలాంగుడివి కావని,ఆత్మస్థైర్యం లేని ప్రతి ఒక్కరు వికలాంగులని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని తండ్రి చెప్పిన మాటలను మది నిండా నింపుకొని కొండంత ధైర్యంతో విద్యార్థి కోడం నిఖిల్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మోడల్ స్కూల్లో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష కేంద్రానికి వికలాంగుడైన కోడం నిఖిల్ ను తన తండ్రి రవి ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చారు. పరీక్ష కేంద్రానికి తన చేతులతో ఎత్తుకొని పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. నేటి సమాజంలో అన్ని ఉన్న వ్యక్తులే జీవితంపై శ్రద్ధ చూపడం లేదు అలాంటిది వికలాంగుడైన తన జీవితం గొప్ప స్థాయికి ఎదగాలని ఆ విద్యార్థి పట్టుదలతో పదవ తరగతి పరీక్షలు రాయడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. చదువుకు ఏది అడ్డు లేదని నిరూపిస్తున్నాడు విద్యార్థి నిఖిల్. పరకాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కోడం రవి చిన్నప్పటినుండి కుమారుని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తన జీవితం కోసం చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.