రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు భూర్క వెంకటయ్య అన్నారు. మండల కేంద్రంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వరి పంట సాగు చేయవద్దని, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ప్రకటనలు చేస్తూ రైతాంగాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, రైతులు విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకొని సాగు చేసుకోవచ్చని చెప్పుతూ మరో వైపు వరి సాగును నిషేధించినట్లుగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రకటనలతో అయోమయానికి భయాందోళనకు గురవుతున్నరని,ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సరైన అవగాహన కల్పించకుండా, భూసార పరీక్షలు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి వీలుండదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను మూలంగానే కార్పొరేట్ శక్తులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలనీ, భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, ఆహారోత్పత్తుల దిగుబడి నిషేధించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరిసాగుపై నిషేధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. సమావేశం అనంతరం అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి యాదగిరి యుగంధర్, లాలు, జాడి సారన్న ,లక్ష్మన్న, గుగులోత్ హచ్చ, ఎర్రన్న పాల్గొన్నారు.