Sunday, November 24, 2024

Guduru: పూర్తి స్థాయిలో హక్కు పత్రాలు అందించాలని.. రైతుల ఆందోళన

గూడూరు, (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగా, రాంసింగ్ తండ గ్రామాలకు చెందిన రైతులు తమ పోడు భూములకు హక్కు పత్రాలు పూర్తిస్థాయిలో రాలేదని ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిటిసి బోడా కిషన్, సర్పంచ్ బోడా మంగీలా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరిజనులకు న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తే, దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, ఫారెస్ట్ అధికారులు మామూళ్లకు ఆశపడి భూమిలేని వారికి భూములు ఉన్నట్టుగా, ఉన్నవారికి ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు ఉన్నట్టుగా హక్కు పత్రాలు రావడం జరిగిందన్నారు.

దీంతో గిరిజన రైతులు అన్యాయానికి గురికావాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి రీ సర్వే నిర్వహించి నష్టపోయిన గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement