ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని, 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగ ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు చేస్తుందని, ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడారు.
రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం తగదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. పదేళ్లలో ఏనాడూ రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని వారు అధికారం కోల్పోయిన తర్వాత రైతులను ఆందోళనకు గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గుండు సున్నా వేశారని, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబుల్ సున్నాలు వేస్తారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి మొత్తం మూడు విడతల్లో ప్రభుత్వం రుణమాఫీ చేసిందని తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, అటువంటి రైతుల నుండి ఫిర్యాదు తీసుకుని క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. త్వరలోనే రైతులందరికీ కూడా రుణమాఫీ కోసం ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కౌన్సులర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.