వరంగల్ : ఎంబీబీఎస్ రెండవ విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ పూర్తి అయింది. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత నేటితో కళాశాలలో చేరేందుకు గడువు ముగుస్తుంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాల్సిందిగా ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావును కోరారు. అదేవిధంగా ఎంబీబీఎస్ మూడో విడత కౌన్సిలింగ్ లోనూ తమకు అవకాశం కల్పించాలని, లేదంటే మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు.
మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకొని సెకండ్ ఫేజ్ లో జాయిన్ అయిన వారికి అప్ గ్రేడేశన్ కు అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రెండవ విడతలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన అభ్యర్థులకు శుక్రవారం సాయింత్రం వరకు గడువు పొడగించాలని, మూడవ విడత కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించాలని కాళోజి యూనివర్సిటీ ఉపకులపతిని ఆదేశించారు. ఈ మేరకు యూనివర్సిటీ కళాశాలలో చేరేందుకు రేపటి వరకు గడువు పొడిగించింది. అలాగే మంత్రి ఆదేశాల మేరకు అభ్యర్థులకు మూడో విడత కౌన్సిలింగ్ లో అవకాశం కల్పిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఇది గమనించి ఒక్క రోజు గడువు పొడగించినందున శుక్రవారం సాయింత్రం లోగా సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది.