వాజేడు, మే19 (ప్రభ న్యూస్) : మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధుల పట్ల అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుంది. దీంతో పనులు చేపట్టే కాంట్రాక్టర్ అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేకుండానే అర్ధరాత్రి వంతెన నిర్మాణ పనులు చేపడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం కొనసాగిస్తూ కోట్లాది నిధులు కొల్లగొడుతున్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామం నుండి ఏడుజర్ల పల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు మంజూరు చేశారు. దీనిలో భాగంగా వాజేడు గ్రామ శివారులో 65.18 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణం చేపట్టేందుకు నాలుగు కోట్ల 85 లక్షల రూపాయలు మంజూరు చేశారు. టెండర్ కైవసం చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉండగా.. నాణ్యతకు పాతరేస్తూ ఆదరాబాదరగా నిర్మాణ పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాసిరకమైన సిమెంట్ స్టీలు వాడుతూ వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంది.
అధికారులు లేకుండానే కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపడుతూ ఆదరబాదరగా వంతెన నిర్మాణం పూర్తి చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం సాగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో పనులు చేయాల్సిన కాంట్రాక్టర్ అర్ధరాత్రి ఇంతెన నిర్మాణ కాంక్రీట్ పనులు చేపడుతూ ఇష్టారాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. వంతెన నిర్మాణం 50 శాతం పూర్తయినప్పటికీ ఒక్కరోజు కూడా క్యూరింగ్ చేయకపోవడంతో వంతెన నిర్మాణం పట్ల నీలినీడలు అలుముకున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు పది కాలాలపాటు ఉపయోగపడాల్సిన వంతెన నిర్మాణ పనుల పట్ల అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్ ఇంతటి నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబు అని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు కాంట్రాక్టర్ చెప్పు చేతుల్లో పని చేయడంతో వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పూర్తిగా కొరబడిందని పలువురు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వంతెన నిర్మాణ పనులు చేపట్టరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇలా కోట్లాది రూపాయలు కాజేసే పనిలో పడ్డారని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనుల పట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రాంత ప్రజలకు పది కాలాలపాటు ఉపయోగపడే విధంగా వంతెన నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.