వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా సీట్లు కేటాయిస్తున్నామని, సీటు రాని వారికి భవిష్యత్ లో మంచి అవకాశం కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు… టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న 18 అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ బీ ఫామ్లు అందించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్లే.. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా టికెట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, సీనియర్లను కూడా కలుపుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. టికెట్ రాని వారికి భవిష్యత్లో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టికెట్ వచ్చిన అభ్యర్థులు, రాని వారిని కలుపుకొని వెళ్లాలని, పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. టికెట్లు రాని నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ సమన్వయ కమిటీ ముందు చెప్పాలని, బహిరంగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగర వేస్తామని, 66 మందిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక వరంగల్ నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. వరంగల్ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని కోపోద్రిక్తులయ్యారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, నాయకుల మధ్య తగాదాలు పెట్టేందుకు చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. వరంగల్ నగరానికి రూ. 1600 కోట్లతో ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలని మంత్రి దయాకర్ రావు అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, “అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగురవేస్తాం. అన్ని సీట్లు గెలిచి సీఎం కేసిఆర్ గారికి కానుకగా ఇస్తాం. గత ఏడేళ్లలో వరంగల్ లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాకముందు 70 ఏళ్లలో జరగలేదు. ఎవరెన్ని మాట్లాడినా ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్ కు నేరుగా బడ్జెట్లో ఏటా 300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు వేరే పార్టీలు దరిదాపుల్లో కూడా లేవు. టిఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ. 20 ఏళ్లుగా పూర్తి చేసుకున్న పార్టీగా టిఆర్ఎస్ లో అనేక మంది అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారు. 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 7 ఏళ్లు అధికార పార్టీగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ నగర ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కుటుంబ సభ్యులు గా పార్టీ గెలుపు కోసం సహకరిస్తారని ఆశిస్తున్నాం.
వరంగల్ నగరం అభివృద్ధి కావాలన్నా, ఇక్కడి ప్రజల అవసరాలు తీరాలన్నా ఈ నగరం గురించి, నగర ప్రజల అవసరాల గురించి సంపూర్ణంగా తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి పట్టం కట్టాలని, టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను” అని అన్నారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, “డివిజన్ల లో సమస్యలు పరిష్కరిస్తున్నం. పోటీ చాలా ఉంది. ఉద్యమంలో చాలా మంది పని చేశారు. డీ లిమిటేషన్ కావడం వల్ల రిజర్వేషన్ మారి చాలా ఇబ్బంది ఏర్పడింది.
ఆ రెండు ప్రతిపక్ష పార్టీల నాయకులు వరంగల్ నగరం పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇంకా చాలా జరగాలి. చేస్తున్నాం. కేంద్రం నిధుల వల్ల అభివృద్ధి జరిగినట్లు కొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇస్తున్న పన్నులు ఎంత, తిరిగి కేంద్రం మనకు ఇస్తుంది ఎంత అనేది ఈ నేతలు చెబితే బాగుంటుంది. మనం కట్టిన పన్నుల ప్రకారం కేంద్రం మనకు చాలా ఇవ్వాలి. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి స్పష్టత మాకు ఉంది. వరంగల్ నగరానికి రింగ్ రోడ్డు వచ్చింది…మంచి నీటి పథకాలు, డ్రైనేజీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. ముంబై కు పూణే అయినట్లు హైదరాబాద్ కు వరంగల్ అభివృద్ధి కానుంది. ఇప్పటికే ఐటీ టవర్స్ వచ్చాయి. ఇంకా చాలా వస్తున్నాయి. టెక్స్ టైల్ పార్కు అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ గొప్పగా జరుగుతుంది. అందులో కొన్నిటిని ప్రధాన నగరాలుగా తీర్చి దిద్దుతున్నారు” అని అన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, పార్టీ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బోంతు రామ్మోహన్ సమన్వయ కమిటీ సభ్యులు, బాధ్యులు పాల్గొన్నారు.
సీటు రాకపోయినా నిరాశ వద్దు .. భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తాంః మంత్రి ఎర్రబెల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement