తొర్రూరు : క్షయ వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని, వచ్చే 2025 నాటికి టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ గుండాల మురళీధర్ అన్నారు. జిల్లా క్షయ నివారణ విభాగం, బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలో క్షయ వ్యాధి నిర్మూలన పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా కళారంజని సందీప్ సాంస్కృతిక బృందం ఆధ్వర్యంలో చేపట్టిన కళా ప్రదర్శన ఆకట్టుకుంది. మండల వైద్యాధికారి డాక్టర్ మీరాజ్ తో కలిసి గుండాల మురళీధర్ మాట్లాడుతూ టీబీతో ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తున్నారని, ప్రజల్లో ఆ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు.
రెండు వారాలకు మించి దగ్గు, తెమడ, సాయంత్రం జ్వరం రావడం, ఆకలి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా చేయడంతో పాటు ప్రతినెలా పౌష్టికాహారం తీసుకునేందుకు రూ.500 పంపిణీ చేస్తున్నదని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులు 8.7మిలియన్లు ఉంటే, ఒక్క భారతదేశంలోనే ఈ సంఖ్య 2.6మిలియన్లుగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. మన దేశంలో టి.బిని నియంత్రిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిని చాలావరకు నిర్మూలించినట్లు అవుతుందని అన్నారు. సరైన చికిత్స తీసుకుంటే టి.బి వ్యాధి నయం అవుతుందని, వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాటిల్లే అవకాశాలూ లేకపోలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ సూపర్వైజర్ జయమణి, ఏఎన్ఎం లు సత్య వేద మణి,బి.శ్రీలత, బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రశాంత్, సందీప్ ,రవి,అర్జున్, కృష్ణంరాజు,చిరంజీవి, రాజు, పోలీసులు సారయ్య, తిరుమలేష్, ఆశా వర్కర్లు రేణుక, అరుణ, శ్రీలత, సుజాత, సునీత, హేమలత, ఆటో కార్మికులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.