జనగామ : జనగామ జిల్లాలో వాన దంచి కొడుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతాలాకుతలమవుతోంది. ఇటీవల వారం రోజులు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పూర్తిగా నిండిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి వర్షం దంచి కొట్టడంతో అనేకచోట్ల వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు నీటమునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేలలో నీరు నిల్వ ఉండడంతో రైతులు పంట నష్టపోవాల్సి వస్తున్నది. శనివారం అదే మాదిరిగా తెల్లవారుజామున నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
- వాగులో చిక్కుకున్న మహిళా కూలీలను సురక్షితంగా తరలింపు..
లింగాలఘన్ పూర్ మండలంలోని శుక్రవారం కురిసిన వర్షానికి చీటూరు గ్రామంలోని గోపు – వాగు ఉధృతంగా ప్రవహించింది.
చీటూరు గ్రామానికి చెందిన 14మంది మహిళా కూలీలు నాటే వేసే పనులకు వెళ్లారు. వాగు ఉదృతంగా ప్రవహించడంతో మహిళా కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.దీంతో వెంటనే గ్రామ కూలీలను రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ అధ్వర్యంలో రెస్క్యూ చేసి, సురక్షితంగా బయటకు చేర్చారు. ఈ ఆపరేషన్ లో డీసీపీ వెస్ట్ జోన్ సీతారాం ఆదేశాల ప్రకారం ఘన్ పూర్ ఏసీపీ రఘుచందర్, రఘునాధ్ పల్లి సీఐ వినయ్ కుమార్, లింగాల ఘనపూర్ ఎస్ఐ రఘుపతి, ఫైర్ సిబ్బంది, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
- చెరువును తలపిస్తున్న ఆర్టీఓ కార్యాలయం..
జనగామ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్టీఓ కార్యాలయం వరద నీటిలో మునిగి పోయింది. దీంతో కార్యాలయం చెరువును తలపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ వరద నీరు అలానే ఉండిపోయింది. దీంతో కార్యాలయంకు వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - జిల్లాలో ఇప్పటివరకు 142.9మీ.మీ వర్షం
జిల్లాలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంకు సగటున 142.9 మిల్లీమీటర్లగా నమోదైంది. అత్యధికంగా దేవరుప్పుల లో 241.8మీ.మీ, కొడకండ్ల 186.2మీ.మీ, లింఘాల ఘన్ పూర్ 165.6మీ.మీ, జనగామ 159.4మీ.మీ, పాలకుర్తి 136.2మీ.మీ, బచ్చన్న పేట 132.2 మీ.మీ, నర్మేట 130.2 మీ. మీ, రఘునాధ్ పల్లి 124.6 మీ.మీ, జఫర్ గడ్ 85.4మీ.మీ , ఘన్ పూర్ స్టేషన్ 67.0మీ. మీ గా నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు అన్ని మండలాలకు కలిపి 1428.6మీ.మీ మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.