మరిపెడ: పాఠశాలకు వచ్చిన బాల మాలధారుడిని పరుష పదజాలంతో దూషించి, దేవుళ్లను సైతం విమర్శించిన పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలని మాలధారులు సదరు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద బుదవారం జరిగింది. మాలధారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి తన తండ్రితో పాటుగా శివమాల ధరించాడు. మంగళవారం పాఠశాలకు వచ్చిన బాల మాలధారుడు మధ్యాహ్నం సమయంలో భిక్షకు వెళ్లేందుకు పీఈటీని అనుమతి కోరగా.. ఎవరు నిన్ను మాల వేసుకొమ్మన్నారు అంటూ పరుష పదజాలంతో దూషించినట్లు బాలుడు తన తండ్రికి ఇంటికి వెళ్లాక చెప్పినట్లు సమాచారం. దీంతో తండ్రి విషయాన్ని మరిపెడలోని మాలధారులకు తెలపడంతో అంతా కలిసి బుధవారం పాఠశాలకు వెళ్లారు. విద్యార్థిని దూషించిన విషయమై పీఈటీని వివరణ కోరగా పెడసరిగా సమాధానం ఇచ్చారని, దీంతో వారు పాఠశాల గేటు వద్ద కూర్చొని ధర్నా చేసినట్లు తెలిపారు.
అనంతనం పోలీసులు పాఠశాలకు చేరుకోగా పాఠశాల హెడ్మాస్టర్ ఫోన్ ద్వారా మండల విద్యాధికారిని సంప్రదించారు. విద్యాధికారి అందుబాటులో లేరని, వారు వచ్చాక శాఖ పరమైన చర్యలు విచారణ అనంతరం తీసుకుంటామనటంతో మాలధారులు ధర్నా విరమించారు. అనంతరం పోలీసులు సదరు పీఈటీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు మాలధారులు, బాలుడి తండ్రి కలిసి పోలీసులకు ఫిర్యాదు అందించారు. అయితే గురువారం చర్యలు తీసుకోని పక్షంలో మండలంలోని సుమారు 500 మంది మాలధారులం పాఠశాల ఎదుట శాంతియుతంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. ఇంత జరిగాకా సదరు పీఈటీ తన తప్పు ఏమైనా ఉంది అనుకుంటే మన్నించడని, తనను పిల్లలు, ఇక్కడి వారు అర్థం చేసుకోవటం లేదని పెడసరిగా వివరణ ఇవ్వటం గమనార్హం. కాగా సదరు పీఈటీ ప్రవర్తన మొదటి నుంచి దూకుడుగా ఉందని, అందరితో దురుసుగా ప్రవర్తించేవాడని, విద్యార్థినిల పట్ల కూడా దుష్పరివర్తన కలిగి ఉండటంతో గతంలోనూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తోటి ఉపాధ్యాయులపై కూడా అజమాయిషీ చేలాయించేవాడని తెలుస్తోంది.