Friday, November 22, 2024

70 ఏండ్లలో జరగని అభివృద్ది.. 7 ఏండ్ల కేసీఆర్ పాలనతోనే సాధ్యమైంది .. మంత్రి ఎర్రబెల్లి

70 ఏండ్లలో జరగని అభివృద్ది..7 ఏండ్ల కేసీఆర్ పాలనతోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరిలో రూ.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ గోపి ప్రారంభించారు. అలాగే పర్వతగిరి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు 12 కోట్ల రుణాల చెక్కులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పల్లె ప్రగతితో తెలంగాణా పల్లెల రూపురేఖలు మారుతున్నాయన్నారు. తెలంగాణ గ్రామాలకు జాతీయ అవార్డులు రావడమే ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. మన ఊరు మన బడితో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామన్నారు. రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంట్ తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. మరికొద్దిరోజుల్లోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ… తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement