మహబూబాబాద్, మార్చి31 : పంటనష్ట నివేదికలను పక్కాగా రూపొందించాలని, 3 రోజుల్లో తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో పంట నష్ట నివేదికలను రూపొందించడంలో అదనపు కలెక్టర్ తో కలిసి వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 9,100 మంది రైతులకు సంబంధించి 21,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. పంట నష్ట నివేదికలను వాస్తవాలతో రూపొందించేందుకు వ్యవసాయ శాఖ లోని 85 క్లస్టర్ లలో 27 క్లస్టర్ లలో పంటనష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతు వివరాలు సమగ్రంగా సేకరించి నివేదికకు జతపరచి సమర్పించాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్ లు ప్రతిరోజు రూపొందించిన నివేదికలు అందించాలన్నారు.
పంట నష్టం నివేదిక రూపొందించడంలో వ్యవసాయ సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని, ఎకరానికి 10వేలు నష్టపరిహారం ప్రభుత్వ ప్రకటించినందున నివేదికల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని, ఇతర అధికారులతో తనిఖీ చేపిస్తామన్నారు. పంటనష్టం నివేదిక రూపొందించేటప్పుడు రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తొర్రుర్, పెదవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, కేసముద్రం మండలాల్లో పంటనష్టం ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులందరూ పంటనష్టం నివేదిక నమోదు కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. పంటనష్టం నివేదికలో రైతు బ్యాంక్ ఖాతా నెంబర్ తో పాటు, ఆధార్ నెంబర్ నమోదు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సమాచారం కోసం సీపీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9603607910 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓ కొమరయ్య, సీపీఓ సుబ్బారావు, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, మత్స్య శాఖ అధికారి నాగమణి, సహకార శాఖ అధికారి ఖుర్షీద్ వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.