చిట్యాల, అక్టోబర్ 24 (ఆంధ్ర ప్రభ) : ఉమ్మడి చిట్యాల మండలంలోని మానేరు, చలివాగు పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అర్ధరాత్రి తరలిస్తే తగు చర్యలు తప్పవని భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్ రావు అన్నారు. గురువారం మండలంలోని కాల్వపల్లి, కలికోట మానేరు వాగు ప్రాంతాలలో తిరిగారు.
అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తమ అవసరాలకు ఇసుక వాడుకోవాలని, అక్రమంగా లాభార్జన ధ్యేయంగా వ్యాపారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ నిబంధనలు ప్రకారం బిగించుకోవాలని డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని కోరారు.
లేని యెడల వాహనాలను సీజ్ చేసి మోటార్ వెహికల్ చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్శనలో చిట్యాల తహసీల్దార్ హేమ, చిట్యాల సీఐ దగ్గు మల్లేష్, ఎస్.ఐ శ్రావణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.