వరంగల్, హన్మకొండ జిల్లాల్లో సిపిఐ ఆద్వర్యంలో జరుగుతున్న భూ పోరాట కేంద్రాలను సందర్శించి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బినోయ్ విశ్వంను హన్మకొండలో పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక హరిత కాకతీయ హోటల్ లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుండగానే హోటల్ చుట్టూ మోహరించిన పోలీసులు ఎంపి బినోయ్ విశ్వం బయటికిరాగానే ఆయనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, పార్టీ నాయకులు పంజాల రమేష్, షేక్ బాష్ మియా, తోట బిక్షపతి, మండ సదాలక్ష్మి, ఉట్కూరి రాములు, ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్, దండు లక్ష్మణ్ తదితరులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, సిపిఐ నాయకులకు మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నగరంలో భూ కబ్జాదారుల ఒత్తిడితోనే భూ పోరాటాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన ఎంపి, ఇతర నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకున్న సిపిఐ కార్యకర్తలు, ఆయా కాలనీల్లోని పేదలు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ముట్టడించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. నాయకుల అరెస్టు, పోలీస్ స్టేషన్ ముట్టడితో హన్మకొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement