ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అప్రజాస్వామిక నియంతల కుట్ర అని భూపాలపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ మొక్కిరాల జనార్దన్ రావు అన్నారు. సోమవారం చంద్రబాబు అరెస్ట్, నిర్బంధానికి నిరసనగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద భూపాలపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకి సంఘీభావంగా, సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా జనార్ధన్ రావు మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడుపై ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎన్ని నిర్బంధాల పాలు చేసినా ధర్మబలంతో కడిగిన ముత్యంలా మచ్చలేని చంద్రునిలా జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ ప్రజాసేవకై అంకితం అవుతారన్నారు. తెలంగాణలో సైతం బీఆర్ఎస్ తీరు చాలా ఆప్రజాస్వామికంగా ఉందన్నారు. ఒకపక్క తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొంటూ చంద్రబాబుకు మద్దతు తెలుపుతుంటే, కేటీఆర్ మాత్రం రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఒక రోజేమో తెలంగాణలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలా అవసరం ఏముంది అంటాడు. మరొక రోజేమో ఖమ్మంలో రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ అంటారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్టీఆర్ చంద్రబాబు అభిమానుల ఓట్ల కోసం రోజుకో మాయమాటలు మాట్లాడుతూ మళ్ళీ మాయ చేసే కుతంత్రాలకు కేటీఆర్ దిగుతున్నాడన్నారు.
కానీ ప్రజలు ఎల్లకాలం మోసపోరన్న విషయాన్ని, వాస్తవాన్ని కేటీఆర్ అధికారం మత్తులో మరిచిపోతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఈ మాయమాటల సంగతి కచ్చితంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గద్దె నుండి దింపే సమయం ఆసన్నమైందన్నారు. అందుకే మాటలు మారుస్తూ కాలం గడుపుతున్నారన్నారు. అభివృద్ధి చేసే నాయకులకు అండగా నిలబడినప్పుడే మన భవిష్యత్తు నిలబడుతుందన్న వాస్తవాన్ని గుర్తించి ప్రతి తెలుగువాడు తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా, ఆంధ్రాలో జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధిని పునః ప్రతిష్ట చేసే పుణ్యకార్యం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకై ప్రతి ఒక్క తెలుగు వాడు అడుగులేసి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు ఉపాధ్యక్షులు అందే భాస్కరాచారి, వరంగల్ పార్లమెంటు కార్యనిర్వాక కార్యదర్శి మాచర్ల నగేష్, పార్లమెంట్ కార్యదర్శి కందుకూరి నరేష్, జిల్లా నాయకులు బంటుపల్లి పాల్గుణ, కుర్మ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.