Friday, November 22, 2024

రైతులకు వసతులు కల్పించేందుకు చర్యలు

ఎండాకాలం దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కనీస వసతులు కల్పించాలని  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కేసముద్రం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణ రావుతో కలిసి సద్ధిమూట కార్యక్రమంతో పాటు యార్డుకు వచ్చిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎండాకాలం దృష్ట్యా రైతులకు యార్డులో మంచినీటి సౌకర్యం, కనీస వసతులు కల్పించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చేందుకు ఇంటి నుండి తెల్లవారుజామునే బయలుదేరి రావడం, భోజనం కొరకు పంట ఉత్పత్తులు వదిలి బయటకు వెళ్లి రావడం ఇబ్బందికరమైన విషయమన్నారు. సద్దిమూట కార్యక్రమం ద్వారా రైతులకు నామమాత్రపు రుసుము ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ భోజనం వడ్డించారు. అనంతరం కలెక్టర్ యార్డుకు వచ్చిన పంట ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకొని, పరిశీలించారు. రైతులు మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చినప్పుడు ఎంట్రీ గేట్ పాస్ ద్వారా తెచ్చిన పంట ఉత్పత్తులను ఆన్లైన్లో నమోదు చేసి, ఆన్లైన్లో ఆక్షన్ కొరకు అందించిన స్లీప్ ను పంటల వారీగా పరిశీలించారు. మార్కెట్ యార్డ్ కు వస్తున్న మొక్కజొన్న, పసుపు, మిర్చి, కందులు, పెసర్లు, పల్లికాయ ఉత్పత్తుల వివరాలను అధికారులు, రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ- టెండర్ హాల్ లో తక్ పట్టి జారీ కేంద్రంలో ఆన్లైన్ ప్రక్రియ, తూకం వేసే విధానంను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement