Friday, November 22, 2024

మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌ దే .. ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి : స్వరాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు నింపారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలోని భీం గణపురం చెరువులో ఈరోజు 11లక్షల చేప పిల్లలను, 340000 రొయ్య పిల్లలను దాదాపు రూ.21.38లక్షల విలువ గల పిల్లలను 100% రాయితీతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దివాకర్ లు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారన్నారు. గుక్కెడు మంచినీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందని, తెలంగాణలో ఎక్కడ చూసినా ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుందన్నారు.

మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో 7 ఏండ్లకు ముందు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలన్నారు. స్థానికంగా ముదిరాజ్ సోదరులు చెప్పిన సమస్యపై త్వరలో జిల్లా మత్స్య శాఖ అధికారులు కలెక్టర్ తో సమావేశం జరిపి త్వరగతిన వలల్ని సమకూర్చాలని తెలిపారు. అడవి ప్రాంతం ఎక్కువ ఉన్న గ్రామాల్లో చాలా వరకు పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు ముఖ్యమంత్రి వెసులుబాటు కల్పిస్తూ హక్కు పత్రాలను అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ బంటు అనూష, ఎంపీటీసీ ప్రశాంతి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, మండల పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ కల్లేపు రఘుపతి రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మందల సాగర్ రెడ్డి, యూత్ అధ్యక్షడు రఘుపతి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement