Friday, November 22, 2024

ఈ విద్యా సంవత్సరం నుంచే భూపాలపల్లి మెడికల్‌ కళాశాలలో తరగతులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ విద్యా సంవత్సరం నుంచే భూపాలపల్లి మెడికల్‌ కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 8న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కళాశాలలు ఎంపిక చేసుకున్న వారు ఈనెల 26లోగా సంబంధిత కళాశాలలో ధృవీకరణ పత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాలని కాళోజీ హెల్త్‌ వర్సిటీ పేర్కొంది.

ఇందులో భాగంగా ఈ ప్రక్రియ ఈనెల 24న ప్రారంభం కాగా, భూపాలపల్లి మెడికల్‌ కళాశాలకు పలువురు విద్యార్థులు వచ్చి అడ్మిషన్లు తీసుకున్నారు. కళాశాల ప్రారంభానికి కావాల్సిన అన్ని వసతులను వారికి ఏర్పాటు చేస్తున్నారు. కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్ర కోటా కింద 85 సీట్లు, ఆలిండియా కోటా కింద 15 సీట్లు కేటాయించారు. మరో రెండు విడతల్లో నిర్వహించే కౌన్సిలింగ్‌లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కానున్నాయి.

కళాశాలకు కావాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఏడాది ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం తరగతులు కొనసాగనున్నాయి. కాగా, భూపాలపల్లి మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు 80 శాతం వరకూ పూర్తయ్యాయి. కళాశాలలో కావాల్సిన పరికరాలు కూడా ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి.

- Advertisement -

విద్యార్థులకు తాత్కాలికంగా హాస్టల్‌ వసతి కోసం కళాశాలకు సమీపంలో 14 క్వార్టర్లను కేటాయించారు. కళాశాలలో హాస్టల్‌ వసతి గృహాలు, అనుబంధ ఆసుపత్రి, ఇతర భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ. 110 కోట్ల నిధులను కేటాయించింది. మరోవైపు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రి మెడికల్‌ కళాశాలగా మారనుంది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆసుపత్రిని పూర్తిగా మెడికల్‌ కళాశాల పరిధిలోకి తీసుకు రానున్నారు. జిల్లా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement