తొర్రూర్ టౌన్, జులై 7 (ప్రభన్యూస్) : దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు వాణిశ్రీ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ లో 4651 ర్యాంకు సాధించి ఐఐటీ సీటు సాధించింది. గ్రామానికి చెందిన తండ్రి ధర్మారపు నాగయ్య తల్లి మహేశ్వరిల మొదటి కుమార్తె వాణిశ్రీ. ఉస్మానియా మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతున్నదని చెప్పారు. మొదటి నుండి చదువులో ముందంజలో ఉందని చెప్పారు. చర్లపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి, 10జిపిఎస్ సాధించింది.
నెక్కొండలోని ఇంటర్మీడియట్ టిఎస్ఆర్ జె సి ఎంపీసీలో 976 మార్కులు సాధించింది. అనంతరం ఐఐటి కోచింగ్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ కోచింగ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ నిర్వహించిన ఉచిత కోచింగ్ కు ఎంపికై హైదరాబాదులో సంవత్సర కాలంపాటు ఐఐటి కోచింగ్ తీసుకొని ఐఐటి సీటుకు అర్హత సాధించిందని తల్లిదండ్రులు తెలిపారు. మారుమూల గ్రామమైన చర్లపాలెం గ్రామం నుంచి దళిత నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ప్రతిభ ఎవరి సొంతం కాదని నిరూపించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వాణిశ్రీ కి స్వీటు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. వాణిశ్రీని గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు మట్టిలో మాణిక్యమని అభినందించారు. వాణిశ్రీ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అన్నారు.