కేంద్రం ప్రభుత్వం మరోసారి బడ్జెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండి చెయ్యి చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు విమర్శించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద హనుమకొండలోని కాళోజీ విగ్రహం ఎదుట సీపీఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ పై ఉమ్మడి జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు మరోసారి అడియాశలు అయ్యాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం పట్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్శిటీలను కేంద్రం విస్మరించిందని, విభజన హామీలకు కేటాయింపులు జరుపకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేసిందని అన్నారు.
మరోవైపు మోడీ ప్రభుత్వం తన పక్షపాత బుద్దిని బయట పెట్టుకుంటూనే ఉన్నదని, అన్నిరాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై కరుణ చూపారని, నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయం ప్రకటించారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలపై, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పట్ల తమ ప్రభుత్వ ప్రేమను కనబరిచారని అన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులను కేటాయించలేదని, టెక్స్ టైల్ పరిశ్రమను పట్టించుకోలేదని అన్నారు. దేశంలో డిజిటలైజేషన్ పేరుతో కార్పొరేట్ వర్గాలకే పెద్దపీట వేశారని, వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా చివరి బడ్జెట్ లోనూ ఉద్యోగ కల్పన మాట మరిచారని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో అంకెల గారడీతో మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మునిగాల బిక్షపతి, మారపాక అనిల్, కొట్టెపాక రవి, కండే నరసయ్య, భాష బోయిన సంతోష్, మాలోతు శంకర్, వేల్పుల ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.