ఎగిసిపడుతున్న జలధారలు
కనువిందు చేస్తున్న జలపాతం అందాలు
వాజేడు, జులై 17 ప్రభ న్యూస్ : గత రెండు రోజులుగా ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతంలోకి అత్యధికంగా వరదనీరు చేరడంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తుంది. జలధారలు ఎగిసిపడుతూ తుంపర్లను వెదజల్లుతుంది. కనువిందు చేస్తున్న బొగత జలపాతం అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు.
బొగత జలపాతం అందాలను చూసేందుకు ఆంధ్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు. బొగత అందాలను తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. దీంతో బొగత జలపాతం ప్రాంగణం జనసంద్రంగా మారింది. బొగత జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా జలపాతం ప్రదేశానికి చేరుకొని అందాలను వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరిలోకి వరద నీరు చేరి క్రమేపి పెరుగుతుంది.