కరోనా కట్టడిలో ఆశాల పాత్ర అమోఘం అని, ప్రజారోగ్యం లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆశా వర్కర్ల జనగామ జిల్లా మహాసభను మంత్రి ఎర్రబెల్లి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే.. గతంలో ఆశాలు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెలుసుకొని జీతాలను రూ. 9 వేల 750 కి పెంచారని ఆయన అన్నారు.
ఆశా వర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్ వారికి స్మార్ట్ ఫోన్లు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 15 వందలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆశాల జీతం 9 వేల 750 కి చేరిందని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, మీ సమస్యలు ఏమైనా ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ నిచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.