మరిపెడ: మూలిగే నక్కపై తాటి పండు పడింది అన్న చందంగా మారింది దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి. కరోనా సంక్షోభం నుంచి బయటపడినా ధరల సంక్షోంభం నుంచి బయటపడలేక పోతున్నారు. లాక్ డౌన్ ఆర్థిక సంక్షోభం పేరుతో ఇష్టానుసారంగా అన్నింటి ధరలు పెంచటంతో సామాన్యుడు కుదేలువుతున్నాడు. ప్రపంచ దేశాల యుద్ధాలు, జీడీపీ, తలసరి ఆదాయం పేరుతో పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటంతో రవాణ వ్యవస్థపై భారం పెరిగింది. దీంతో ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యలు డీజీల్ ధరలకు అనుగుణంగా రవాణా చార్జిలు పెంచటంతో దీని ప్రభావం అన్నింటిపై పడింది. ఫలితంగా సామాన్యుడి సగటు ఆదాయం ఖర్చులకు మిక్కిలి అయ్యింది. చమురు, నిత్యవసరాలు, కరెంటు, ఎరువులు, విత్తనాలు ఇలా అన్నింటి ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు ధరల సుడిగుండంలో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు.
గడచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు :
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మన దేశంలో ప్రభుత్వాలకు పెట్రోలియం ప్రధాన ఆదాయం. దేశంలో 2019 డిసెంబర్ నాటికి లీటర్ పెట్రోల్ రూ.80, డీజిల్ రూ.71, 2020 డిసెంబర్ నాటికి పెట్రోల్ రూ.87, డీజిల్ రూ.80, 2021 డిసెంబర్ నాటికి పెట్రోల్ రూ.108, డీజిల్ రూ.94, ప్రస్తుతం 2022- పెట్రోల్ రూ.112.95, డీజిల్ రూ.99.65కి చేరింది. దేశంలో 2021 గణాంకాలను అనుసరించి అసలు పెట్రోల్ ప్రాథమిక ధర రూ.44 ఉండగా, డీజిల్ రూ.46 ఉంది. కానీ లీటరుపై రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం ఖాతాలోకి వెళ్తే, ఆయా రాష్టాలు వారి ఆదాయాన్ని అనుసరించి 20 నుంచి 23 శాతం వరకు వ్యాట్ రూపేన పన్ను విధిస్తున్నారు. దీంతో వినియోగదారుడికి చేరే వరకు అసలు ధర రెండింతలు పెరుగుతోంది. దీని ప్రభావం సరుకుల రవాణాపైన పడుతుండటంతో నిత్యవసరాల ధరలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి.
గ్యాస్ సిలిండర్‌పై బాదుడు :
తొలుత సబ్సిడీ పేరుతో వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్రం సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలకు జమ చేసేది. ఇటీవలే సబ్సిడీ భారాన్ని మోయలేమంటూ ఎత్తేసింది. అంతే కాకుండా ఐదు నెలల నుంచి ఇప్పటి వరకు సిలిండర్ ధరలు పెంచలేదంటూ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1000కి చేరుకోగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.2087 పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు, చిన్న తరహా హోటళ్లు, నాలుగు చక్రాల బండ్లు, టీ స్టాళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో పేద, దిగువ మధ్య తరగతి వారు గ్యాస్ పేరు ఎత్తితేనే హడలిపోయే పరిస్థితి.
నిర్మాణ రంగంపై దెబ్బ :
ధరల పెరుగుదల ప్రధానంగా భవన నిర్మాణాలపై అధికంగా ప్రభావం చూపుతోంది. కరోనాకు ముందు ఇళ్ల నిర్మాణాల కోసం కూడబెట్టుకున్న నగదు లాక్ డౌన్ అనంతరం అమాంతం పెరగటంతో దేశంలో చాలా మంది సొంతింటి కల ఆశగానే మిగిలిపోయింది. కరోనాకు ముందు సిమెంట్ ధర రూ. 230 నుంచి మేలైన రకం 500 వరకు పలుకగా.. ప్రస్తుతం ఒక బస్తా రూ.470 నుంచి రూ.1000కి పైగా చేరింది. అదే విధంగా ఐరన్, పేయింటింగ్స్, మార్బుల్, టయిల్స్, కరెంట్, ప్లంబింగ్ వంటి రా మెటిరియల్ ధరలు ఒక్కసారిగా రెట్టింపు అవటంతో సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులపై కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం పడింది. నిత్యవసరాల ధరలు, రవాణా చార్జిలు, పెట్రోల్ ధరలు పెరగటంతో భవన నిర్మాణ కార్మికులు సైతం తమవల్ల కాదంటూ చేతులెత్తేసే పరిస్థితి. దీంతో చేసేది లేక కొంత మంది పక్క రాష్టాల నుంచి భవన నిర్మాణ కార్మికులను తెప్పించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు.
నిత్యవసరాల పరిస్థితి సరేసరి :
కరోనా దెబ్బ, లాక్ డౌన్, ఉక్రయిన్ యుద్ధం కారణంగా నిత్యవసరాలు చుక్కలు చూపిస్తున్నాయి. వంటింట్లో ప్రధానంగా వాడే వంట నూనే డబుల్ సెంచరీ దాటేసింది. కరోనాకు ముందు వరకు పామాయిల్ రూ.70 నుంచి 80, సన్‌ఫ్లవర్ రూ.85 నుంచి 95 పలుకగా.. లాక్‌డౌన్‌తో పామాయిల్ ధర రూ.120 కాగా సన్‌ఫ్లవర్, పల్లి నూనె రూ. 140 నుంచి 160కి పెరిగింది. ఉక్రయిన్ యుద్ధం పుణ్యమా అని అది కాస్తా డబుల్ సెంచరీ దాటి రూ. 205కు ప్రస్తుతం చేరింది. ఇక పప్పు దాన్యాలు, కూరగాయల సంగతి సరేసరి. స్థానికంగా కురగాయలు సాగు చేస్తున్న జనాభాకు అనుగుణంగా లేకపోవటంతో పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా నుంచి కూరగాయలు దిగుమతి చేసుకొవాల్సిన పరిస్థితి. దీంతో ఇక్కడ రైతు వద్ద అంకెల్లో పలికే వాటి ధర వినియోగ దారులకు చేరే సరికి సంఖ్యల్లోకి పెరుగుతోంది. అంతే కాకుండా కరెంటు చార్జిల పెంపు కూడా అందరిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఏప్రిల్ నుంచి అమలు కానున్న పెరిగిన యూనిట్ చార్జ్‌లతో సామాన్య ప్రజానీకానికి పెద్ద షాక్ తగలనుందని నిపుణుల అంచనా. గతంలో ధరలు పెరిగినప్పుడు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రేషన్ షాపుల్లో సబ్సిడి పద్దతిన సామాన్యులకు అందుబాటు రేటులో 9 నుంచి 13రకాల (నూనె, కందిపప్పు, గోధుమలు, చెక్కెర, కిరోసిన్, పసుపు, సర్ఫ్, చింతపండు, సబ్బులు తదితర) నిత్యవసరాలు అందించేది. కాని ఇప్పుడు వాటి ధరలు గణనీయంగా పెరుగుతున్న రేషన్ షాపులో అటువంటి వ్యవస్థను పునఃప్రారంభించకపోవటం శోచనీయం ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచి పెరిగిన ధరలకు కళ్లెం వేయాలని సగటు మనిషి కోరుకుంటున్నాడు.
టీ కొట్టె జీవనాధారం : శంకర్, మర్రిపెడ
టీ కొట్టె జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రోజంతా చేసినా రూ.300 నుంచి 400 మిగలవు. ఒక్కొసారి రూ. 200 మిగలటం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో గ్యాస్ ధర పెంచటంతో వారానికి ఒకసారి రూ.2వేలు పెట్టలేను. ప్రభుత్వం చొరవ తీసుకుని గ్యాస్ ధరలు తగ్గించాలి.
పేదలపై.. ధరాఘాతం : పేదల బ్రతుకు బారమాయె
Advertisement
తాజా వార్తలు
Advertisement